“బాధిత జర్నలిస్టులను పరామర్శించిన రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొంపెల్లి మహేష్
“ఆరోపణలు నిజమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
“బాధిత జర్నలిస్టులకు రాజన్న ప్రెస్ క్లబ్ అండ
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల,అక్టోబర్17:
రాజన్న సిరిసిల్ల జిల్లాలో జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణల నేపథ్యంలో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత జర్నలిస్టులు పోతురి శేఖర్, రాతిపల్లి సంపత్లను రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొంపెల్లి మహేష్ శుక్రవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ప్రెస్ క్లబ్ తరఫున పూర్తి అండదండలు అందిస్తామని భరోసా ఇచ్చారు.
ఈ నెల 12వ తేదీన తమపై జరిగిన ఘటన తీవ్ర అన్యాయమని బాధిత జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చోటుచేసుకున్న నేరెళ్ల ఘటనను తలపించేలా సిరిసిల్ల జిల్లాలో మరోసారి జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు రావడం దారుణమని వారు పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో ఆందోళనకర పరిణామం
ఈ సందర్భంగా కొంపెల్లి మహేష్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా భావించే జర్నలిజం రంగంలో పనిచేస్తున్న వారిపై ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళనకరమన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉందన్నారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడులు, వేధింపులకు పాల్పడితే ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు.
ఈ ఘటనపై ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరిపి, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత జర్నలిస్టులకు న్యాయం జరిగే వరకు జర్నలిస్టు సంఘాలన్నీ ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు.
జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. జర్నలిస్టులపై జరిగే అన్యాయాలను ప్రశ్నించడంలో, వారి హక్కుల పరిరక్షణలో రాజన్న ప్రెస్ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుందని మహేష్ స్పష్టం చేశారు. ప్రజల పక్షాన నిలబడి వార్తలు రాసే జర్నలిస్టులకు రక్షణ కల్పించి, బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగం అమానుషం
RELATED ARTICLES



