📄 ePaper
Friday, August 28, 2026
Homeతెలంగాణసజ్జనార్ పేరుతో ఫేక్‌ అకౌంట్ మోసం

సజ్జనార్ పేరుతో ఫేక్‌ అకౌంట్ మోసం

📰 Generate e-Paper Clip

ఐపీఎస్ అధికారి పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతా సృష్టించిన మోసగాళ్లు
– ఆపదలో ఉన్నానంటూ పంపిన మెసేజ్‌లను నమ్మి డబ్బు పంపిన స్నేహితుడు
– ఇలాంటి స్కామ్‌లను నమ్మవద్దని, వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని సజ్జనార్ సూచన

(హైదరాబాద్, నవంబర్ 15) (మనప్రజాప్రతినిధి):

సైబర్ నేరగాళ్లు ఇప్పుడు సామాన్యులనే కాదు, ఉన్నతాధికారులను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారు. హైదరాబాద్ సీపీ, సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతా సృష్టించి, ఆయన స్నేహితుల్ని మోసం చేసిన ఘటన వెలుగుచూసింది. సజ్జనార్ పేరుతో పంపిన సందేశాలను నమ్మిన ఆయన స్నేహితుడు సైబర్ మోసగాళ్లకు రూ.20,000 పంపించడంతో ఈ విషయం మరింత సంచలనంగా మారింది. ఈ మోసంపై సజ్జనార్ స్వయంగా సోషల్ మీడియాలో హెచ్చరిక జారీ చేశారు. సజ్జనార్ వివరాల ప్రకారం, తన పేరుతో నకిలీ ఖాతాను తమ స్నేహితులకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపేందుకు మోసగాళ్లు ఉపయోగించారు. “అత్యవసరం ఉంది… ఆపదలో ఉన్నాను… వెంటనే డబ్బు పంపండి” అంటూ పంపిన సందేశాలు చూసి ఒక స్నేహితుడు నిజమేనని భావించి డబ్బు పంపాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన అధికారిక ఖాతా తప్ప మిగతా అన్ని ఖాతాలు నకిలీవేనని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనతో సైబర్ సెక్యూరిటీ ప్రమాదం ఎంత తీవ్రమైందో మరోసారి బయటపడింది. ఈ నేపథ్యంలో సజ్జనార్ ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. ప్రముఖుల పేర్లతో వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను అంగీకరించవద్దని, సందేశాలు వచ్చినా డబ్బులు పంపకూడదని హెచ్చరించారు. ఆ వ్యక్తితో నేరుగా ఫోన్‌లో మాట్లాడి నిర్ధారించుకోవడం తప్పనిసరి అని సూచించారు. అలాగే అనుమానాస్పద లింకులు, మెసేజ్‌లు, తెలియని ఖాతాల నుంచి వచ్చే వ్యక్తిగత సమాచార అభ్యర్థనలను వెంటనే బ్లాక్ చేయాలని, 1930 సైబర్‌హెల్ప్‌లైన్‌కు లేదా అధికారిక వెబ్‌సైట్‌కి ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ మోసంపై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు చర్యల్లోకి దిగారు. నకిలీ ఖాతాలను ట్రేస్ చేసి మెటా సహకారంతో తొలగించే ప్రక్రియలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు, సామాన్యులు అని తేడా లేకుండా సైబర్ నేరగాళ్లు అవకాశాలను వెతుకుతున్నందున, సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తత అత్యంత కీలకం అని పోలీసులు సూచిస్తున్నారు. వేగంగా పెరుగుతున్న ఈ మోసాల నేపథ్యంలో ప్రజలు ప్రతి డిజిటల్ కమ్యూనికేషన్‌ను జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం మరింతగా పెరిగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.