📄 ePaper
Sunday, August 23, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలు500 చిన్నారులకు పునర్జన్మ... సత్యసాయి సంజీవని సేవలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు

500 చిన్నారులకు పునర్జన్మ… సత్యసాయి సంజీవని సేవలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు

📰 Generate e-Paper Clip

°నిరుపేదల పాలిట దేవాలయం..ప్రతి ఏటా 6 వేల గుండె శస్త్రచికిత్సలు ఉచితం
°ట్రస్ట్‌కు ఒక సంవత్సర జీతాన్ని విరాళంగా ప్రకటించిన మాజీ మంత్రి హరీష్ రావు
కొండపాకమండలం(మనప్రజాప్రతినిధి ),జూలై5:
సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని శ్రీ సత్యసాయి సంజీవని చైల్డ్ హార్ట్ కేర్ అండ్ రీసెర్చ్ సెంటర్ మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న 500 మంది చిన్నారులకు విజయవంతంగా ఉచిత శస్త్రచికిత్సలు పూర్తి చేసి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి సినీనటుడు విజయ్ దేవరకొండ, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, ట్రస్ట్ నిర్వాహకులు శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. సత్యసాయి సంజీవని ఆసుపత్రి నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాలకు నిజమైన వరమని, ఇది వైద్యసేవల రూపంలో నిలిచిన దేవాలయమని కొనియాడారు. ప్రతి సంవత్సరం సుమారు 6 వేల మంది చిన్నారులకు అత్యాధునిక గుండె శస్త్రచికిత్సలను పూర్తిగా ఉచితంగా నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ట్రస్ట్ సేవలను మరింత విస్తరించాలని ఆకాంక్షిస్తూ, తన ఒక సంవత్సర జీతాన్ని ట్రస్ట్‌కు విరాళంగా అందజేస్తున్నట్లు ప్రకటించారు.
చిన్నారుల చికిత్సతో పాటు వారి తల్లిదండ్రులకు ఉచిత వసతి, భోజన సౌకర్యాలు కల్పించడం ట్రస్ట్ సేవా భావానికి నిదర్శనమని పేర్కొన్నారు. సేవాభావంతో పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, ఆసుపత్రి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.
సినీనటుడు విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. తాను పదో తరగతి వరకు సత్యసాయి విద్యాసంస్థల సహకారంతో చదువుకున్నానని గుర్తు చేసుకున్నారు. సత్యసాయి ట్రస్ట్ సేవలు మానవత్వానికి నిలువెత్తు నిదర్శనమని, ట్రస్ట్‌ను స్థాపించిన శ్రీనివాసరావు దేవునితో సమానమైన వ్యక్తి అని కొనియాడారు. సిద్దిపేట జిల్లాలో ఇలాంటి మహోన్నత సేవా సంస్థ ఏర్పాటుకు సహకరించిన మాజీ మంత్రి హరీష్ రావుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలతో పాటు సిద్దిపేట షేర్ గా బిరుదును ఇచ్చాడు..ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, ప్రజాప్రతినిధులు, చిన్నారుల కుటుంబ సభ్యులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.