స్టేషన్ బెయిల్ కోసం రూ.30 వేలు డిమాండ్
రాజంపేట ఎస్సైపై అవినీతి కేసు నమోదు
ఇంట్లోనే లంచం తీసుకుంటూ పట్టుబాటు
కామారెడ్డి,ఆగస్టు21(మనప్రజాప్రతినిధి): స్టేషన్ బెయిల్ మంజూరు చేయడంతో పాటు చార్జిషీట్లో తక్కువ శిక్ష పడే సెక్షన్లు నమోదు చేస్తానంటూ లంచం డిమాండ్ చేసిన ఎస్సై ఏసీబీ అధికారులకు చిక్కాడు. కామారెడ్డి జిల్లా రాజంపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై దువ్వాల ఆంజనేయులు రూ.30 వేల లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సమాచారం ప్రకారం ఒక కేసులో నిందితుడిగా ఉన్న తన కుమారుడికి స్టేషన్ బెయిల్ మంజూరు చేయాలని బాధితుడు ఎస్సైను సంప్రదించాడు. అలాగే కేసులో తక్కువ శిక్ష పడే విధంగా సెక్షన్లు నమోదు చేయాలని కోరాడు. ఈ నేపథ్యంలో తన సహకారం అందించేందుకు ఎస్సై రూ.30 వేల లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది.
ఎస్సై డిమాండ్‌తో విసిగిపోయిన బాధితుడు నేరుగా ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన అధికారులు ప్రాథమిక విచారణ నిర్వహించి ఆరోపణల్లో నిజానిజాలను నిర్ధారించారు. అనంతరం ప్రత్యేక వ్యూహం రూపొందించి ఎస్సైని పట్టుకునేందుకు ఉచ్చుపన్నారు. ఏసీబీ సూచనల మేరకు బాధితుడు లంచం మొత్తాన్ని ఎస్సైకు అందజేయగా, గురువారం ఆయన స్వగృహంలోనే డబ్బు స్వీకరిస్తున్న సమయంలో అధికారులు దాడి నిర్వహించారు. లంచం తీసుకుంటున్న దశలోనే ఎస్సైను అదుపులోకి తీసుకుని నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రసాయన పరీక్షలు నిర్వహించి ఆధారాలను సేకరించారు.
ఈ ఘటనపై ఎస్సై దువ్వాల ఆంజనేయులుపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం నిందితుడిని నాంపల్లి ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా ఉద్యోగులు లంచాలు డిమాండ్ చేసినా లేదా అక్రమాలకు పాల్పడినా వెంటనే ఏసీబీకి సమాచారం అందించాలని అధికారులు ప్రజలకు సూచించారు. ఇందుకోసం టోల్ ఫ్రీ నంబర్ 1064తో పాటు వాట్సాప్ నంబర్ 9440446106 అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజల సహకారంతో అవినీతిని నిర్మూలించేందుకు చర్యలు కొనసాగుతాయని ఏసీబీ పేర్కొంది.
లంచం తీసుకుంటూ ఏసీబీకి ఎస్సై పట్టుబాటు
RELATED ARTICLES



