పోలీసుల బలప్రయోగ ఆరోపణలపై విచారణ
ఐదుగురు సభ్యులతో ఉన్నత స్థాయి బృందం
మధ్యంతర నివేదికలు ఇవ్వాలని సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ,ఆగస్టు21(మనప్రజాప్రతినిధి): నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారానికి వ్యతిరేకంగా నిర్వహించిన చలో పార్లమెంట్ ఆందోళనల సందర్భంగా పోలీసుల బలప్రయోగంపై వచ్చిన ఆరోపణలను విచారించేందుకు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు చేపట్టేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయమాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి కమిటీకి అధ్యక్షత వహించనుండగా, పంజాబ్-హరియాణా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్.కే. ఝా, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శలిందర్ కౌర్, సీబీఐ మాజీ డైరెక్టర్ ఆర్.కే. శుక్లా, మేఘాలయ మాజీ డీజీపీ ఎల్.ఆర్. బిష్ణోయ్ సభ్యులుగా ఉన్నారు.
ఆందోళనకారులపై పోలీసులు పెల్లెట్ గన్స్, టియర్ గ్యాస్, ఎలక్ట్రిక్ లాఠీలు, లాఠీచార్జి వంటి చర్యలు చేపట్టారనే ఆరోపణలను కమిటీ పరిశీలించనుంది. మహిళా నిరసనకారులపై జరిగినట్లు ఆరోపిస్తున్న హింస, భద్రతా బలగాల వ్యవహార శైలి, అవసరానికి మించి బలప్రయోగం జరిగిందా అనే అంశాలను కూడా విచారించనుంది. మరోవైపు ఆందోళనల సందర్భంగా పోలీసులపై జరిగిన దాడులు, హింసాత్మక ఘటనలు, ప్రభుత్వ మరియు ప్రజా ఆస్తుల ధ్వంసంపై కూడా కమిటీ దృష్టి సారించనుంది. నిరసనల సమయంలో రెండు వర్గాల పాత్రను సమగ్రంగా విశ్లేషించి వాస్తవాలను వెలికితీయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
కమిటీ సభ్యుల అనుభవం, నైపుణ్యం, విభిన్న రంగాల ప్రాతినిధ్యాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ధర్మాసనం పేర్కొంది. కమిటీ సిఫార్సులు న్యాయస్థానానికి విలువైన మార్గదర్శకంగా నిలుస్తాయని, పోలీసు చర్యలు చట్టబద్ధ ప్రమాణాలకు అనుగుణంగా జరిగాయా అనే అంశాన్ని కూడా పరిశీలించాలని సూచించింది. నీట్ పేపర్ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో జూలై 20న ఢిల్లీలో పార్లమెంట్ వైపు నిర్వహించిన నిరసన ర్యాలీలో భద్రతా సిబ్బంది, ఆందోళనకారుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అనంతరం సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలతో బలప్రయోగంపై వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఇప్పుడు ఉన్నతస్థాయి కమిటీని నియమిస్తూ, మధ్యంతర నివేదికలను క్రమం తప్పకుండా సమర్పించాలని ఆదేశించింది.



