ప్రజారోగ్యంతో చెలగాటమాడిన అక్రమ వ్యాపారం
పోలీస్ కమిషనర్ బి. సుమతి పర్యవేక్షణలో దాడులు
రూ.25 లక్షల విలువైన సరుకు స్వాధీనం
కల్తీ వ్యాపారులపై కఠిన చర్యల హెచ్చరిక
మల్కాజిగిరి,ఆగస్టు21(మనప్రజాప్రతినిధి): ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే కల్తీ ఆహార పదార్థాల తయారీ కేంద్రంపై మల్కాజిగిరి పోలీసులు మెరుపుదాడులు నిర్వహించి భారీ స్థాయిలో మసాలా పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మెడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో ఉన్న సాయి తిరుమల ఎంటర్‌ప్రైజెస్‌లో అపరిశుభ్ర పరిస్థితుల్లో కల్తీ మసాలా పొడులను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ దాడుల్లో సుమారు రూ.25 లక్షల విలువైన 10.89 టన్నుల మసాలా పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో ఎస్ఓటీ మల్కాజిగిరి, ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ బృందాలు తనిఖీలు నిర్వహించగా పసుపు పొడి, కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలాలను ఆహార భద్రతా ప్రమాణాలు పాటించకుండా తయారు చేస్తున్నట్లు బయటపడింది. ముఖ్యంగా కారం పొడిలో 30 శాతం వరకు రంపపు పొడి కలిపినట్లు గుర్తించడం అధికారులను విస్మయానికి గురిచేసింది. ప్రజలు ఉపయోగించే మసాలా దినుసులనే కల్తీ వ్యాపారానికి వినియోగిస్తున్న తీరును పోలీసులు తీవ్రంగా పరిగణించారు.
తనిఖీల్లో అసలు బ్రాండ్లను పోలిన నకిలీ ప్యాకింగ్, లేబుళ్లను ఉపయోగించి వినియోగదారులను మోసం చేస్తున్నట్లు కూడా గుర్తించారు. నాసిరకం ఉత్పత్తులను ఆకర్షణీయమైన ప్యాకెట్లలో నింపి మార్కెట్లో విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. ఈ వ్యవహారంలో సత్యనారాయణ, రుద్రశేఖర్ అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. దాడిలో 2,300 కిలోల పసుపు పొడి, 3,350 కిలోల కారం పొడి, 5,140 కిలోల ధనియాల పొడి, 100 కిలోల గరం మసాలా స్వాధీనం చేసుకున్నారు. తయారీ, ప్యాకింగ్‌కు ఉపయోగిస్తున్న ముడి పదార్థాలు, యంత్రాలు, ప్యాకింగ్ సామగ్రిని కూడా పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సరుకును మెడిపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించి తదుపరి చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ బి. సుమతి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిపై చట్టం ఉక్కుపాదం మోపుతుందని హెచ్చరించారు. వినియోగదారుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కల్తీ ఆహార పదార్థాలను మార్కెట్లోకి పంపడం అత్యంత తీవ్రమైన నేరమని పేర్కొన్నారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై నిరంతర నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు. వినియోగదారులు ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలు కొనుగోలు చేసే సమయంలో తయారీ తేదీ, గడువు, బ్యాచ్ నంబర్, ఆహార భద్రతా గుర్తింపు వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. తమ పరిసరాల్లో కల్తీ ఆహార పదార్థాల తయారీ లేదా విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజారోగ్యాన్ని కాపాడటంలో ప్రజల అప్రమత్తత కూడా కీలకమని బి. సుమతి పేర్కొన్నారు.
మెడిపల్లిలో కల్తీ మసాలాల గుట్టురట్టు
RELATED ARTICLES



