📄 ePaper
Tuesday, August 25, 2026
Homeఆంధ్రప్రదేశ్స్థానిక ఎన్నికలపై జగన్ దిశానిర్దేశం

స్థానిక ఎన్నికలపై జగన్ దిశానిర్దేశం

📰 Generate e-Paper Clip

స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే ప్రజా తీర్పు స్పష్టమని వ్యాఖ్య
– బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని సూచన
– కేడర్ బలోపేతానికి గుర్తింపు కార్డుల పంపిణీ
– లీగల్, మీడియా వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని పిలుపు
తాడేపల్లి, ఆగస్టు 25 (మనప్రజాప్రతినిధి): స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగితే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. పార్టీ ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన రానున్న స్థానిక ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తూ పలు కీలక సూచనలు చేశారు. ఈ ఎన్నికలు కేవలం గెలుపోటములకు సంబంధించినవి మాత్రమే కాదని, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు అండగా నిలబడాల్సిన సమయం అని జగన్ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ, ఈసారి ప్రతి స్థానంలోనూ బలమైన, సమర్థులైన అభ్యర్థులను నిలబెట్టాలని నాయకులకు సూచించారు.
ఏ నియోజకవర్గంలోనూ పోటీ లేకుండా ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వకూడదని జగన్ స్పష్టం చేశారు. అవసరమైతే నాయకులు తమ కుటుంబ సభ్యులను కూడా ఎన్నికల బరిలోకి దించేందుకు వెనుకాడవద్దని పిలుపునిచ్చారు. ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే అక్కడి సమన్వయకర్తల పనితీరును పార్టీ పరిశీలిస్తుందని హెచ్చరించారు. పార్టీ కేడర్ బలోపేతం కోసం 14 నుంచి 15 లక్షల క్యూఆర్ కోడ్ ఆధారిత గుర్తింపు కార్డులు సిద్ధమయ్యాయని తెలిపారు. సెప్టెంబరు 5 నుంచి మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించి వాటిని పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. గ్రామ స్థాయిలో పార్టీ ప్రచారాన్ని మరింత విస్తృతం చేయాలని సూచించారు.
కార్యకర్తలకు న్యాయపరమైన సహాయం అందించేందుకు నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు లీగల్, మీడియా విభాగాలను బలోపేతం చేయాలని జగన్ ఆదేశించారు. అవసరమైతే కేసులను ఉన్నత న్యాయస్థానాల వరకు తీసుకెళ్లేలా సమన్వయ వ్యవస్థను సిద్ధం చేయాలని చెప్పారు. సామాజిక మాధ్యమాలను సమర్థంగా వినియోగించుకోవాలని, డిజిటల్ వేదికల ద్వారా పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాబోయే 60 నుంచి 70 రోజుల పాటు నాయకులు తమ నియోజకవర్గాల్లోనే ఉంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని జగన్ పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.