📄 ePaper
Monday, August 24, 2026
Homeతెలంగాణపవర్ ఎగ్జిబిషన్ 2026కు శ్రీకారం ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం

పవర్ ఎగ్జిబిషన్ 2026కు శ్రీకారం ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం

📰 Generate e-Paper Clip

– ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం
– విద్యుత్ రంగ బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం
– ఆధునిక సాంకేతిక సేవలకు ప్రాధాన్యం
– శక్తివంతమైన తెలంగాణ నిర్మాణమే ధ్యేయం

హైదరాబాద్, ఆగస్టు 24 (మనప్రజాప్రతినిధి):

హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో టీజీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘పవర్ ఎగ్జిబిషన్–2026’ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. విద్యుత్ రంగంలో తెలంగాణ సాధించిన పురోగతిని ప్రజలకు పరిచయం చేయడం, భవిష్యత్ ప్రణాళికలను ప్రదర్శించడం ఈ ప్రదర్శన ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో విద్యుత్ రంగాన్ని మరింత పటిష్టం చేస్తున్నామని చెప్పారు. పారిశ్రామిక, వ్యవసాయ, గృహ అవసరాలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు.
రాష్ట్రంలో ఒకప్పుడు 13 వేల మెగావాట్లుగా ఉన్న విద్యుత్ గరిష్ఠ డిమాండ్ ప్రస్తుతం 18 వేల మెగావాట్లకు చేరుకున్నప్పటికీ సమర్థవంతమైన ప్రణాళికలతో నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగిస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో థర్మల్, సోలార్, హైడల్, బ్యాటరీ స్టోరేజ్ వంటి పలు మార్గాల్లో సామర్థ్యాన్ని పెంచుతున్నామని ఆయన వివరించారు. ఆధునిక సాంకేతికత వినియోగంతో విద్యుత్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని చెప్పారు. 1912 టోల్‌ఫ్రీ సేవ, పవర్ అంబులెన్స్‌లు, అండర్‌గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ వంటి వినూత్న కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.
విద్యుత్ శాఖ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా కల్పించడంతో పాటు పెండింగ్ ప్రమోషన్లను కూడా మంజూరు చేసినట్లు చెప్పారు. ఉద్యోగుల సంక్షేమం, సేవల మెరుగుదల రెండింటినీ సమానంగా ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. విద్యుత్ కొరత లేని శక్తివంతమైన తెలంగాణ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో చేపడుతున్న సంస్కరణలు, ఆధునికీకరణ చర్యలు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి బలమైన పునాదిగా నిలుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.