📄 ePaper
Wednesday, August 26, 2026
Homeఆంధ్రప్రదేశ్పిఠాపురం ఆధ్యాత్మిక వైభవానికి రూ.30.66 కోట్లు

పిఠాపురం ఆధ్యాత్మిక వైభవానికి రూ.30.66 కోట్లు

📰 Generate e-Paper Clip

– దేవాలయాలు,భజన మందిరాల అభివృద్ధికి భారీ నిధులు
– ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో పనులకు వేగం
– భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు చర్యలు
– ఆధ్యాత్మిక వారసత్వ పరిరక్షణకు ప్రాధాన్యం

పిఠాపురం, ఆగస్టు 26 (మనప్రజాప్రతినిధి): పిఠాపురం నియోజకవర్గంలోని ఆధ్యాత్మిక, చారిత్రక క్షేత్రాల అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో రూ.30.66 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఆలయాల పునరుద్ధరణ, భజన మందిరాల నిర్మాణం, కల్యాణ మండపాల అభివృద్ధి ద్వారా నియోజకవర్గ ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత పెంపొందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులు ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలోని 24 ప్రముఖ దేవాలయాల అభివృద్ధి, పునరుద్ధరణ కోసం రూ.17.06 కోట్లను కేటాయించారు. గొల్లప్రోలు సీతారామస్వామి ఆలయంలో ప్రాకార మండపం నిర్మాణం తుది దశకు చేరుకోగా, కొత్తపల్లిలోని జగన్నాథ, సత్యనారాయణ స్వామి ఆలయాల్లో ధ్వజస్తంభాల ప్రతిష్ఠాపన పనులు పూర్తయ్యాయి. పిఠాపురం వేణుగోపాలస్వామి ఆలయంలో అర్చకుల నివాస గృహాల నిర్మాణం కొనసాగుతుండగా, కుంతీమాధవస్వామి ఆలయం, రామకృష్ణాపూర్ సూర్యనారాయణ స్వామి ఆలయాల్లో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు.
కుక్కుటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.5 కోట్లు, శ్రీపాద శ్రీవల్లభ దేవస్థానానికి రూ.2 కోట్లు కేటాయించి ప్రత్యేక పనులు చేపట్టనున్నారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయాల పరిరక్షణతో పాటు భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పంచ మాధవ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ కుంతీమాధవస్వామి ఆలయం సహా పలు పురాతన దేవాలయాలు ఈ ప్రాజెక్టు ద్వారా కొత్త రూపును సంతరించుకోనున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయాల ఆధునీకరణ పనులు చేపడుతున్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని పుణ్యక్షేత్రాలకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు తరలివస్తుండటంతో, వారికి మరింత మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పండుగలు, బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక ఉత్సవాల సమయంలో భారీగా వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు విస్తరిస్తున్నారు.
ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో యు.కొత్తపల్లి మండలంలోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపం నిర్మాణానికి రూ.2 కోట్లు కేటాయించారు. వివాహాలు, ధార్మిక కార్యక్రమాలు, సామాజిక అవసరాలకు అనువుగా అత్యాధునిక వసతులతో ఈ కల్యాణ మండపాన్ని నిర్మించనున్నారు. గతంలో పిఠాపురం పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపాన్ని కూడా ఆధునిక సదుపాయాలతో పునర్నిర్మించిన విషయం తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని బలోపేతం చేసేందుకు తొలి దశలో 48 భజన మందిరాల నిర్మాణానికి రూ.11.60 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ భజన మందిరాలు భక్తి కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక సమావేశాలు, సాంస్కృతిక వేడుకలకు వేదికలుగా ఉపయోగపడనున్నాయి. మొత్తం రూ.30.66 కోట్లతో చేపడుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలు పిఠాపురం ఆధ్యాత్మిక వారసత్వాన్ని పరిరక్షించడంతో పాటు భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో కీలక పాత్ర పోషించనున్నాయని అధికారులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.