హైదరాబాద్,ఆగస్టు27(మనప్రజాప్రతినిధి): సుదీర్ఘ సినీ ప్రస్థానం కలిగిన ప్రముఖ నటి రమ్యకృష్ణ తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకున్నారు. ఒకప్పుడు తనకు చిత్ర పరిశ్రమలో ‘ఐరన్ లెగ్’ అనే ముద్ర కూడా పడిందని తెలిపారు. సినిమా వద్దనుకుని వెళ్లిపోయేంతటి పరిస్థితులు కూడా ఎదురయ్యాయని ఆమె పేర్కొన్నారు.
తన కెరీర్‌లో ఎదురైన కష్టాలను అధిగమించి స్టార్‌డమ్ సాధించడానికి దర్శకుడు కే. రాఘవేంద్రరావు కారణమని రమ్యకృష్ణ వెల్లడించారు. ఆయన తనకు దైవసమానమైన ఆశీర్వాదమని అన్నారు. ఆయన లేకపోతే తాను ఆ కష్టాలను దాటలేకపోయేదాన్నని, తాను స్టార్‌గా ఎదగడానికి రాఘవేంద్రరావే ప్రధాన కారణమని పేర్కొన్నారు.
‘అల్లుడు గారు’ చిత్రం తన కెరీర్‌లో కీలక మలుపుగా నిలిచిందని రమ్యకృష్ణ గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత ‘అల్లరి మొగుడు’ వంటి చిత్రాలతో మరింత ఉన్నత స్థాయికి చేరుకున్నానని తెలిపారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నానని చెప్పారు.
అవార్డుల కంటే మంచి పని ముఖ్యం
అవార్డులపై తనకు ప్రస్తుతం పెద్దగా ఆసక్తి లేదని రమ్యకృష్ణ స్పష్టం చేశారు. కెరీర్ ప్రారంభంలో అవార్డులపై ఆసక్తి ఉన్నప్పటికీ, కాలక్రమేణా వాటిపై వ్యామోహం తగ్గిందన్నారు. మంచి పాత్రలు పోషించడం, మంచి పని చేయడం, ఇంటికి వచ్చి ప్రశాంతంగా సంతోషంగా ఉండటమే తనకు ముఖ్యమని చెప్పారు.
ప్రశాంతంగా జీవించడమే లక్ష్యం
ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నట్లు రమ్యకృష్ణ తెలిపారు. చెన్నై, హైదరాబాద్ మధ్య ప్రయాణిస్తూ కుటుంబం, వృత్తిపరమైన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నానన్నారు. కష్టపడటం, ప్రశాంతంగా ఉండటం, సంతోషంగా జీవించడం, వీలైతే ఇతరులను సంతోషపెట్టడం.. లేదంటే ఎవరికీ హాని చేయకపోవడం తన జీవిత సూత్రమని వెల్లడించారు. తాను నటించిన సినిమాల సంఖ్యను కూడా ప్రత్యేకంగా లెక్కపెట్టుకోలేదని, అతిథి పాత్రలు, ప్రత్యేక పాటల్లో కనిపించిన చిత్రాలు కూడా చాలానే ఉన్నాయని తెలిపారు.



