📄 ePaper
Friday, September 4, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుమూగజీవి ప్రాణం తీసిన విద్యుత్ నిర్లక్ష్యం..!

మూగజీవి ప్రాణం తీసిన విద్యుత్ నిర్లక్ష్యం..!

📰 Generate e-Paper Clip

దౌల్తాబాద్ ఏఈనా..? లైన్మెన్‌దా..? బాధ్యత ఎవరిది?
సూరంపల్లి నర్సరీలో ప్రమాదకర విద్యుత్ సమస్యపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులు
దౌల్తాబాద్,సెప్టెంబర్03(మనప్రజాప్రతినిధి):
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలోని నర్సరీ ప్రాంతంలో విద్యుత్ షాక్‌కు గురై ఓ బర్రె మృతి చెందిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన తలారి సంజీవ్ తండ్రి సత్తయ్యకు చెందిన బర్రె విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
ముందే హెచ్చరించినా.. స్పందన ఏదీ?
సూరంపల్లి నర్సరీ పరిసరాల్లో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ సమస్యపై గతంలో పలుమార్లు వార్తలు ప్రచురితమయ్యాయి. అంతేకాకుండా సంబంధిత విద్యుత్ శాఖ అధికారులతో పాటు దౌల్తాబాద్ ఏఈకి కూడా పలుమార్లు సమాచారం అందించినప్పటికీ సమస్యను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సమస్యను ముందుగానే గుర్తించి విద్యుత్ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకుని ఉంటే మూగజీవి ప్రాణం కోల్పోయేది కాదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు హెచ్చరికలు వచ్చినప్పటికీ అధికారులు స్పందించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మరో ప్రాణం పోయే వరకు వేచి చూస్తారా..!?
“మూగజీవి ప్రాణం పోయిన తర్వాతైనా అధికారులు స్పందిస్తారా..? లేక మరో ప్రాణం పోయే వరకు ఇదే నిర్లక్ష్యం కొనసాగుతుందా..?” అంటూ గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
నర్సరీ ప్రాంతంలోని విద్యుత్ లైన్లు, స్తంభాలు, ఇతర ప్రమాదకర పరిస్థితులను విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజలు, పశువుల ప్రాణాలకు ముప్పు కలగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అలాగే మృతి చెందిన బర్రెకు సంబంధించి బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.