– మంత్రి పార్థసారథి సంచలన ఆరోపణలు
– దొంగలు దొరికిపోతారనే భయంతోనే సతీష్ కుమార్‌ను హత్య చేశారు
– నెల్లోనే ఛార్జ్‌షీట్ – రాజీపై తీవ్రమైన అనుమానాలు
– వివేకా కేసు తరహాలోనే ఆత్మహత్యగా చూపే ప్రయత్నమని విమర్శ
మంగళగిరి, 17 నవంబర్ (మనప్రజాప్రతినిధి):
టీటీడీ పరకామణిలో జరిగిన రూ.100 కోట్ల విదేశీ కరెన్సీ చోరీ కేసు వెనుక భారీ కుట్ర ఉందని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి సంచలన ఆరోపణలు చేశారు. దోపిడీ వివరాలు బయటపడతాయన్న భయంతోనే అప్పటి విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్‌ను హత్య చేశారని ఆయన ఆరోపించారు. తిరుమల పవిత్రతను భంగం కలిగించేలా గత పాలకులు దోపిడీలు జరిపిన తీరు భక్తులను తీవ్రంగా కలచివేసిందన్నారు. 2023 ఏప్రిల్ 29న సతీష్ కుమార్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినప్పటికీ, ఇలా పెద్ద మొత్తంలో దోపిడీ జరిగి కూడా సాధారణ సెక్షన్లతో కేసు నమోదు చేయడం వెనుక తీవ్ర అనుమానాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన నెల రోజుల్లోనే ఛార్జ్‌షీట్ దాఖలు చేసి, మరుసటి రోజే రాజీ మెమో దాఖలు చేయడం ఎవరి ఒత్తిడితో జరిగిందో వెలుగు చూడాలని అన్నారు. నిందితుడి దగ్గర ఉన్న రూ.14.5 కోట్ల ఆస్తులను ‘దానం’ పేరిట చూపించడం ద్వారా కేసును బలహీనపరిచినట్లు ఆరోపించారు. సతీష్ కుమార్ అనుమానాస్పద మరణాన్ని ఆత్మహత్యగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నట్టు పార్థసారథి విమర్శించారు. సతీష్ సోదరుడు హత్యేనని చెబుతుంటే, పోలీసుల కంటే ముందే మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆత్మహత్యగా ప్రకటించడమే సందేహాస్పదమన్నారు. రాజీ ప్రక్రియ కూడా భూమన ఛైర్మన్ అయిన నెల రోజుల్లోనే జరగడం అనుమానాలను మరింత పెంచుతోందన్నారు. వివేకానంద రెడ్డి, పరిటాల రవి హత్య కేసుల్లో జరిగినట్లే, ఈ కేసులోనూ సాక్షులను తొలగించే కుట్ర కనిపిస్తున్నదని మంత్రి వ్యాఖ్యానించారు. సీబీఐ దర్యాప్తును గతంలో వ్యతిరేకించిన నాయకులు ఇప్పుడు సీబీఐ విచారణ కోరడమే వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నమని విమర్శించారు. తిరుమలపై గత ప్రభుత్వానికి భక్తి, గౌరవం లేవని, పవిత్రతను దోపిడీలకు వేదికగా మార్చారని పార్థసారథి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో ఎంతటి పెద్దవారైనా సరే, చట్టం ముందు నిలబెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పార్థసారథి ప్రభుత్వం తరఫున స్పష్టం చేశారు.
టీటీడీ పరకామణి దోపిడీ కేసులో పెద్ద కుట్ర
RELATED ARTICLES

