_మైనారిటీల రాజ్యాంగ, ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలి
_జమియత్ ఉలమా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా షా సయ్యద్ ఎహ్సానోద్దీన్ రషాదీ వో ఖాస్మీ
మనప్రజాప్రతినిధి//హైదరాబాద్, ఆగస్ట్ 08:
తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మైనారిటీలకు ఇచ్చిన హామీలన్నింటినీ తక్షణమే అమలు చేయాలని జమియత్ ఉలమా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా షా సయ్యద్ ఎహ్సానోద్దీన్ రషాదీ వో ఖాస్మీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ 2023లో ప్రకటించిన మైనారిటీ డిక్లరేషన్‌లోని అన్ని హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆయన కోరారు. మైనారిటీల కోసం మైనారిటీ సబ్-ప్లాన్‌ను వెంటనే అమలు చేయడంతో పాటు, మైనారిటీల సంక్షేమం కోసం ప్రకటించిన వార్షిక రూ.4,000 కోట్ల బడ్జెట్‌ను పూర్తిగా కేటాయించి, పారదర్శకంగా ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు.
ఇమామ్‌లు, ముఅజ్జిన్‌ల గౌరవ వేతనాలను పెంచుతామని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని కోరారు. అలాగే వక్ఫ్ ఆస్తుల రక్షణ, అక్రమ ఆక్రమణల తొలగింపు, సమగ్ర సర్వే, డిజిటల్ రికార్డుల తయారీతో పాటు వక్ఫ్ ఆస్తుల అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
మైనారిటీ విద్యార్థులకు సంబంధించిన పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీ రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, భవిష్యత్తులో విద్యార్థులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రత్యేక DSC ద్వారా ఉర్దూ ఉపాధ్యాయుల నియామకంపై ఇచ్చిన ఎన్నికల హామీని కూడా తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వంలోని కార్పొరేషన్లు, బోర్డులు, అథారిటీలు, సలహా కమిటీలు తదితర ప్రభుత్వ సంస్థల్లో మైనారిటీలకు వారి జనాభా నిష్పత్తికి అనుగుణంగా తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. రాష్ట్రంలో పెరుగుతున్న హేట్ క్రైమ్, హేట్ స్పీచ్‌ను అరికట్టేందుకు సమర్థవంతమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
తెలంగాణ నుంచి రానున్న రాజ్యసభ స్థానానికి సమర్థుడైన ఒక ముస్లిం ప్రతినిధిని నామినేట్ చేసి, రాష్ట్ర మైనారిటీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. మైనారిటీల విద్యా, ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం ప్రకటించిన అన్ని సంక్షేమ పథకాలను ఎలాంటి జాప్యం లేకుండా అమలు చేయాలని అన్నారు.
ఎన్నికల సందర్భంగా మైనారిటీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైతే జమియత్ ఉలమా ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపడతామని మౌలానా షా సయ్యద్ ఎహ్సానోద్దీన్ రషాదీ వో ఖాస్మీ హెచ్చరించారు. ఇందుకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు.
ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలి
RELATED ARTICLES


