ప్రత్యేక జాబ్ పోర్టల్‌ను ప్రారంభించిన మంత్రి
మహాలక్ష్మి హామీ అమలుపై స్పష్టత
నైపుణ్యాభివృద్ధి, ఉపాధికి ప్రాధాన్యం
మెదక్ ఖిల్లాకు ప్రత్యేక తపాలా కవర్ ఆవిష్కరణ
మెదక్,ఆగస్టు17(మనప్రజాప్రతినిధి):
మహిళల ఆర్థిక స్వావలంబన, యువతకు నైపుణ్యాభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన విద్యా సదుపాయాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని శక్తి, కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలు మరియు గనుల శాఖ మంత్రి డాక్టర్ జీ. వివేక్ వెంకటస్వామి తెలిపారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లిలోని శాంతా బయోటెక్నాలజీస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక జాబ్ పోర్టల్‌ను ఆయన ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా ఈ తరహా పోర్టల్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పారిశ్రామిక రంగ అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి చెప్పారు. ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న వందలాది పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య మానవ వనరులను తయారు చేయడమే లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఐటీఐ, పాలిటెక్నిక్ కోర్సుల్లో మార్పులు తీసుకువస్తున్నట్లు తెలిపారు.
ఉద్యోగాల పేరుతో యువత మోసపోకుండా పారదర్శక వ్యవస్థ ద్వారా అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. విదేశీ ఉపాధి అవకాశాల కోసం జర్మన్, జపనీస్ భాషల్లో కూడా శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. మహిళా సాధికారత కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీలు, వడ్డీలేని రుణాలు, ఆదాయ వనరులు కల్పించే కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. మహిళలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం అందించే హామీ అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు.
మెదక్ ఖిల్లా చారిత్రక ప్రాధాన్యతను గుర్తిస్తూ తపాలా శాఖ విడుదల చేసిన ప్రత్యేక తపాలా కవర్‌ను మంత్రి ఆవిష్కరించారు. మెదక్ ఖిల్లాను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. పర్యాటక రంగ అభివృద్ధితో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. అనంతరం కుచారం కస్తూర్బా బాలికల విద్యాలయంలో రూ.3.25 కోట్ల వ్యయంతో నిర్మించిన అదనపు మౌలిక సదుపాయాలను ప్రారంభించారు. విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని, ఉపాధ్యాయులు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. విద్య, వైద్యం, మహిళా సాధికారత, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి రంగాల్లో ప్రజలకు మెరుగైన ఫలితాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు.
మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబాటు
RELATED ARTICLES


