ఖర్గే అధ్యక్షతన కీలక సమావేశం
హాజరైన సోనియా, రాహుల్, ప్రియాంక
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంల పాల్గొనిక
పార్టీ భవిష్యత్ వ్యూహాలపై చర్చ న్యూఢిల్లీ,ఆగస్టు20(మనప్రజాప్రతినిధి): అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పార్టీకి సంబంధించిన కీలక అంశాలు, భవిష్యత్ కార్యాచరణ, రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేతలు, పార్టీ కీలక నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో పాటు వర్కింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతం, రాబోయే రాజకీయ సవాళ్లను ఎదుర్కొనే వ్యూహాలపై నాయకత్వం అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రాల్లో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించడంతో పాటు ప్రజలకు మరింత చేరువయ్యే విధానాలపై చర్చించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కేంద్ర, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కూడా అభిప్రాయాల మార్పిడి జరిగినట్లు సమాచారం. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పాత్రను మరింత బలోపేతం చేయడం, ప్రజా సమస్యలపై ఉద్యమాలను విస్తరించడం, సంస్థాగతంగా పార్టీని బలపర్చడం వంటి అంశాలు సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రాల నుంచి వచ్చిన నాయకులు తమ అభిప్రాయాలు, సూచనలను నాయకత్వం ముందుంచారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, ప్రజాపాలన విధానాల గురించి కూడా రేవంత్ రెడ్డి సమావేశంలో ప్రస్తావించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రాల్లో పార్టీ ప్రభుత్వాల పనితీరును ప్రజలకు మరింత సమర్థవంతంగా చేరవేయాల్సిన అవసరాన్ని నాయకులు నొక్కి చెప్పినట్లు సమాచారం. సమావేశం అనంతరం రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమ వేదికలో స్పందిస్తూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నట్లు వెల్లడించారు. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వర్కింగ్ కమిటీ సభ్యులు హాజరైనట్లు పేర్కొన్నారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో రేవంత్
RELATED ARTICLES


