📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణకార్డు అప్పుల నుంచి బయట పడాలంటే ఇవే మార్గాలు

కార్డు అప్పుల నుంచి బయట పడాలంటే ఇవే మార్గాలు

📰 Generate e-Paper Clip

హైదరాబాద్. నవంబర్ 23

మన ప్రజాప్రతినిది//


క్రెడిట్ కార్డు ఉంది కదా అని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ చివరకు బిల్లులు కట్టలేక అప్పులపాలవుతున్న వారి సంఖ్య దేశంలో రోజురోజుకీ పెరుగుతోంది. మొదట్లో చిన్న మొత్తం అనుకుని వాడిన కార్డు ఖర్చు, వడ్డీలతో కలిపి పెద్ద భారం అవుతోంది. కానీ సరైన అవగాహనతో, కొంచెం క్రమశిక్షణతో క్రెడిట్ కార్డును వాడితే అదే మీకు ఆర్థికంగా సహాయపడే సాధనంగా మారుతుంది. అప్పుల ఊబిలో నుంచి బయట పడేందుకు కొన్ని ప్రాథమిక విషయాలను పాటిస్తే చాలు అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
క్రెడిట్ కార్డు వాడేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది బిల్లు చెల్లింపు. మినిమమ్ డ్యూ కట్టి చేతులు దులుపుకోవడం చాలా మందికి అలవాటు. కానీ ఇలా చేస్తే మిగిలిన మొత్తంపై భారీ వడ్డీ పడుతుంది. అదే పూర్తి బిల్లు సకాలంలో చెల్లిస్తే వడ్డీ భారం ఉండదు, సిబిల్ స్కోర్ కూడా మెరుగవుతుంది. సకాలంలో బిల్లులు చెల్లించడం వల్ల భవిష్యత్తులో తక్కువ వడ్డీకి లోన్లు దొరికే అవకాశం కూడా పెరుగుతుంది.
చాలామంది బిల్లులు మర్చిపోవడం వల్ల ఆలస్యంగా చెల్లించి పెనాల్టీలు ఎదుర్కొంటున్నారు. దీనిని నివారించడానికి పేమెంట్ రిమైండర్ సెట్ చేసుకోవాలి. మొబైల్ యాప్ లేదా బ్యాంకు వెబ్‌సైట్ ద్వారా అలర్ట్స్ పెట్టుకోవచ్చు. ఆటో డెబిట్ ఆప్షన్ ఎంచుకుంటే ఇంకా సులువు. అప్పుడు మీ బ్యాంక్ ఖాతా నుంచి బిల్లు మొత్తం ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. దీంతో ఆలస్యం అనే సమస్యే ఉండదు.
క్రెడిట్ కార్డు వాడుతున్న వారు తరచూ స్టేట్‌మెంట్‌ను చెక్ చేసుకోవడం కూడా అవసరం. నెలవారీ స్టేట్‌మెంట్ చూస్తే ఎంతెంత ఖర్చు చేశామో, ఏ అవసరానికి ఎక్కువ డబ్బు పోయిందో తెలుస్తుంది. అలా చూసుకుని అనవసర ఖర్చులను తగ్గించుకోవచ్చు. కొన్ని బ్యాంకులు ఖర్చులను వర్గీకరించి చూపించే డిజిటల్ టూల్స్ అందుబాటులో పెట్టాయి. వాటిని ఉపయోగించుకుంటే మరింత స్పష్టత వస్తుంది.
ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, అవసరానికి మించి ఎక్కువ క్రెడిట్ కార్డులు తీసుకోవద్దు. ఆఫర్లు, క్యాష్‌బ్యాక్లు ఉన్నాయనే కారణంతో అనేక కార్డులు వాడితే ప్రతి కార్డు బిల్లును ట్రాక్ చేయడం కష్టమవుతుంది. అంతేకాదు, తక్కువ కాలంలో అనేక కార్డులకు అప్లై చేస్తే మీ క్రెడిట్ ప్రొఫైల్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఒక్కటి లేదా రెండు కార్డులే సరిపడేలా చూసుకుని వాటిని బాధ్యతగా వాడితే మంచిది.
ఆర్థిక నిపుణుల మాటల్లో చెప్పాలంటే, క్రెడిట్ కార్డు శత్రువు కాదు.. మీ చేతిలో ఉన్న ఆయుధం. మీరు దాన్ని ఎలాఉపయోగిస్తారన్నదానిపైనే అది మీకు మేలు చేస్తుందా లేదా అప్పులుగా మారుతుందా అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వాడితే క్రెడిట్ కార్డు మీ ఆర్థిక జీవితానికి సహాయకుడే అవుతుంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.