📄 ePaper
Saturday, August 22, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుసదాశివపేటలో నకిలీ సిగరెట్ల దందా కలకలం

సదాశివపేటలో నకిలీ సిగరెట్ల దందా కలకలం

📰 Generate e-Paper Clip

గోల్డ్ ప్లేక్ లైట్స్ పేరుతో డూప్లికేట్ విక్రయం
సదాశివపేట,మార్చి05(మనప్రజాప్రతినిధి):
సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట పట్టణంలో నకిలీ సిగరెట్ల దందా జరుగుతున్నట్లు వచ్చిన ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రముఖ సంస్థ ఐటీసీ లిమిటెడ్ కు చెందిన గోల్డ్ ఫ్లాక్ లైట్స్ బ్రాండ్ పేరుతో డూప్లికేట్ సిగరెట్లు విక్రయమవుతున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. పట్టణంలోని పలు రిటైల్ దుకాణాల్లో ఈ నకిలీ ప్యాకెట్లు అందుబాటులో ఉన్నట్లు సమాచారం.
అసలు ప్యాకెట్‌లతో పోలిక… వినియోగదారులు గందరగోళం
అసలు బ్రాండ్‌కు పోలికగా ప్యాకింగ్ ఉండటంతో సాధారణ వినియోగదారులు సులభంగా మోసపోతున్న పరిస్థితి నెలకొంది. స్థానికుల వివరాల ప్రకారం అసలు, నకిలీ ప్యాకెట్లు బయటకు చూస్తే దాదాపు ఒకేలా కనిపిస్తున్నాయి. ప్యాకింగ్ డిజైన్, హెచ్చరికల ముద్రణ, బ్రాండ్ లోగో కూడా సమానంగా ఉండటంతో తేడా గుర్తించడం కష్టమవుతోందని వారు తెలిపారు. మార్కెట్ ధర కంటే 30 నుంచి 40 శాతం వరకు తక్కువ ధరకు ఈ ప్యాకెట్లు సరఫరా అవుతున్నట్లు సమాచారం. అధికారిక డీలర్ల ద్వారా కాకుండా మధ్యవర్తుల ద్వారా సరుకు సరఫరా అవుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆరోగ్యానికి ముప్పు… ప్రభుత్వానికి ఆదాయ నష్టం
నకిలీ సిగరెట్ల తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్ల వినియోగదారుల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు ఏర్పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నియంత్రణలో లేని పొగాకు పదార్థాలు, ప్రమాదకర రసాయనాల వినియోగం వల్ల ఆరోగ్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు.
అదేవిధంగా నకిలీ సిగరెట్ల విక్రయం వల్ల ప్రభుత్వానికి జీఎస్టీతో పాటు ఇతర పన్నుల రూపంలో భారీ ఆదాయ నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు సూచిస్తున్నాయి. ఈ అక్రమ దందాపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
లేబుల్‌లో సూక్ష్మ తేడాలు… గుర్తించడం కష్టం
అసలు గోల్డ్ ప్లేక్ లైట్స్ ప్యాకెట్‌పై గోల్డ్ రంగు స్పష్టంగా మెరుస్తూ ఉండగా, నకిలీ ప్యాకెట్లలో అది కొంత మసకబారినట్లు కనిపిస్తున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. కొన్ని ప్యాకెట్లలో ముద్రణ స్పష్టత లేకపోవడం, అక్షరాల రంగులో తేడా ఉండటం, ప్యాకెట్ నాణ్యత తక్కువగా ఉండటం వంటి లక్షణాలు గమనించవచ్చని పేర్కొంటున్నారు. అయితే ఇవి సూక్ష్మ తేడాలు కావడంతో సాధారణంగా గుర్తించడం కష్టమవుతోందని తెలిపారు.
వినియోగదారులు అప్రమత్తంగా ఉండి అధికారిక డీలర్ల వద్ద నుంచే కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.