సీబీఐ విచారణకు సిద్ధమన్న వైసీపీ అధినేత
డీఎస్సీ అంశంపై చంద్రబాబును ప్రశ్నించిన జగన్
ఉద్యోగుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని వ్యాఖ్య
తాడేపల్లి,ఆగస్టు21(మనప్రజాప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీపీఎస్సీ గ్రూప్-1 నియామకాల వ్యవహారంలో తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. డీఎస్సీ అక్రమాల అంశం నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ వివాదాన్ని సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. గ్రూప్-1 నియామకాలపై సీబీఐ విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని, అదే విధంగా డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తుకు ప్రభుత్వం సిద్ధమా అని ప్రశ్నించారు. గ్రూప్-1 నియామకాల ప్రక్రియను ప్రస్తావించిన జగన్, ఈ నోటిఫికేషన్‌ను 2019 ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వమే విడుదల చేసిందని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ప్రిలిమినరీ పరీక్ష పూర్తైందని తెలిపారు. అనంతరం తమ హయాంలో ఫలితాలు ప్రకటించి, 2020 డిసెంబర్‌లో మెయిన్స్ పరీక్ష నిర్వహించినట్లు చెప్పారు. టీడీపీ పాలనలో ప్రారంభమైన ప్రక్రియను ఇప్పుడు రాజకీయ కోణంలో చూడడం సరికాదని వ్యాఖ్యానించారు.
కోవిడ్ పరిస్థితుల కారణంగా మూల్యాంకనంలో జాప్యం జరగకుండా ఉండేందుకు ఏపీపీఎస్సీ డిజిటల్ మూల్యాంకన విధానాన్ని పరిశీలించిందని జగన్ తెలిపారు. అయితే దీనిపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం సూచనల మేరకు డిజిటల్ విధానాన్ని పూర్తిగా పక్కనపెట్టామని చెప్పారు. అనంతరం మాన్యువల్ విధానంలోనే జవాబు పత్రాల మూల్యాంకనం నిర్వహించామని, అదే మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ కొనసాగిందని వివరించారు. మాన్యువల్ మూల్యాంకనం పూర్తయిన తర్వాత 163 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకాలు చేపట్టినట్లు జగన్ పేర్కొన్నారు. ఈ ప్రక్రియ మొత్తం హైకోర్టు పర్యవేక్షణలోనే జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు డిజిటల్ మూల్యాంకనంపై ఆరోపణలు చేయడం ద్వారా ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వారి జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. వాస్తవాలు పక్కనపెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం ప్రచారం చేయడం బాధాకరమన్నారు.
గ్రూప్-1 మూల్యాంకనం హాయ్‌ల్యాండ్‌లో జరిగిందన్న ప్రచారాన్ని జగన్ ఖండించారు. అక్కడ ఎలాంటి మూల్యాంకనం జరగలేదని, ఈ విషయాన్ని ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొందని తెలిపారు. దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై ఉపయోగించడం సరైన పద్ధతి కాదని విమర్శించారు. వాస్తవాల ఆధారంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారాల కంటే నిజాలు చివరకు వెలుగులోకి వస్తాయని జగన్ పేర్కొన్నారు. నాలుగేళ్లుగా ఉద్యోగాలు చేస్తున్న అభ్యర్థుల భవిష్యత్తును రాజకీయ ఆరోపణలతో దెబ్బతీయకూడదని సూచించారు. డీఎస్సీ మరియు గ్రూప్-1 అంశాలపై పారదర్శక దర్యాప్తు జరిగితే నిజానిజాలు బయటపడతాయని అన్నారు. ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని, ఎన్ని ఆరోపణలు చేసినా సత్యమే గెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
గ్రూప్-1 వివాదంపై జగన్ సవాల్
RELATED ARTICLES



