“గంటల దొంగ అరెస్ట్..స్కూటీ,రించ్‌పానా,ఆలయ గంటలు స్వాధీనం
సిద్దిపేటరూరల్,సెప్టెంబర్(మనప్రజాప్రతినిధి):
సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాల్లో ఆలయాలను టార్గెట్ చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఆలయంలో దొంగతనానికి యత్నిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ మేరకు సిద్దిపేట రూరల్ సీఐ విద్యాసాగర్ ఆదివారం కేసు వివరాలను వెల్లడించారు.
నిందితుడి వివరాలు:
దుబ్బాక మండలం రాజక్కపేటకు చెందిన ఆస సుదర్శన్ (35), తండ్రి రాజమల్లయ్య, వృత్తిరీత్యా డ్రైవర్‌గా గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి నలుపు రంగు సుజుకి అవెనిస్ స్కూటీ (TS10FC7843), ఆకుపచ్చ రంగు వేగా హెల్మెట్, ఆలయ గంటలను పగలగొట్టేందుకు ఉపయోగించిన రించ్‌పానా, దొంగిలించిన కొన్ని గంటలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇలా దొంగతనాలకు పాల్పడ్డాడు..
నాంచారుపల్లి గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సెప్టెంబర్ 1న నల్లరంగు సుజుకి అవెనిస్ స్కూటీపై వెళ్లిన నిందితుడు రెండు ఆలయ గంటలను అపహరించాడు. అనంతరం ఇర్కోడు ఎల్లమ్మ ఆలయంలో రించ్‌పానా సహాయంతో పెద్ద, చిన్న గంటలతో పాటు హుండీని ఎత్తుకెళ్లాడు. హుండీని పగులగొట్టి అందులోని చిల్లర డబ్బులను తీసుకుని హుండీని పొలాల్లో పడేశాడు. దొంగిలించిన గంటలను సిద్దిపేటలోని పొన్నాల సమీపంలోని స్క్రాప్ షాపులో విక్రయించాడు.
అదేవిధంగా సెప్టెంబర్ 4న రాత్రి రాఘవాపూర్ ఎల్లమ్మ ఆలయంలో మూడు గంటలను, అదే రాత్రి ముస్తాబాద్ మండలం బదనకల్‌లోని ఎల్లమ్మ ఆలయంలో రెండు గంటలను దొంగిలించాడు. అనంతరం తెల్లవారుజాము వరకు వివిధ ప్రాంతాల్లో తిరిగి, సెప్టెంబర్ 5న రంగధాంపల్లి చౌరస్తాలోని స్క్రాప్ షాపులో ఆ గంటలను విక్రయించాడు.
మరో దొంగతనానికి యత్నిస్తుండగా..
సెప్టెంబర్ 5న బురుగుపల్లి ఎల్లమ్మ ఆలయం వద్ద మరో దొంగతనానికి కాపు కాస్తుండగా పోలీసులు సమయస్ఫూర్తితో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
గతంలోనూ దొంగతనాల కేసులు
నిందితుడు గతంలో వివిధ జిల్లాల్లో మోటార్‌సైకిల్ దొంగతనాలకు పాల్పడి పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో వాటర్ ట్యాంక్ డ్రైవర్‌గా పనిచేస్తున్న సమయంలో ప్రమాదం జరిగి కుడికాలికి ఫ్రాక్చర్ కావడంతో సరైన పని లేకపోవడం, డబ్బుల అవసరం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఆలయాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైనట్లు సీఐ తెలిపారు.
పోలీసు సిబ్బందికి అభినందనలు
నిందితుడిని పట్టుకోవడంలో కీలకంగా పనిచేసిన దర్యాప్తు అధికారి డి. నవత, ఎస్ఐ, సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుళ్లు రాజు, రవికాంత్, మల్లేష్, నాగరాజు, ప్రవీణ్, రాకేష్, ప్రదీప్, మహేష్‌తో పాటు సిబ్బందిని సీఐ విద్యాసాగర్ అభినందించారు.



