📄 ePaper
Tuesday, August 18, 2026
Homeతెలంగాణమఠంపల్లిలో రూ.8 లక్షల నిధులపై అనుమానాలు

మఠంపల్లిలో రూ.8 లక్షల నిధులపై అనుమానాలు

📰 Generate e-Paper Clip

-ఇన్చార్జ్ ఎంపీడీవో హయాంలో నిధుల నిర్వహణపై ప్రశ్నలు

-ఇద్దరు పంచాయతీ కార్యదర్శుల పేర్లతో లావాదేవీలు?

మనప్రజాప్రతినిధి//మఠంపల్లి, ఆగస్టు017

మఠంపల్లి మండలంలో గత ఐదు, ఆరు నెలల క్రితం ఇన్చార్జ్ ఎంపీడీవోగా పనిచేసిన కాలానికి సంబంధించిన నిధుల వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మండల పరిధిలోని ఇద్దరు పంచాయతీ కార్యదర్శుల పేర్లతో సుమారు రూ.8 లక్షల మేర నిధులకు సంబంధించిన లావాదేవీలు, వాటి వినియోగంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నిధులు ఏ పనుల కోసం మంజూరయ్యాయి? ఆయా పనులకు ఎంత మొత్తం ఖర్చు చేశారు? పనులు వాస్తవంగా జరిగాయా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఇన్చార్జ్ ఎంపీడీవోగా పనిచేసిన సమయంలో నిధుల నిర్వహణలో ప్రభుత్వ నిబంధనలు, విధి విధానాలు పాటించారా లేదా అన్నదానిపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మరోవైపు ఇద్దరు పంచాయతీ కార్యదర్శుల పేర్లపై నమోదైన నిధుల వివరాలతో పాటు బిల్లులు, వౌచర్లు, పనుల అంచనాలు, మంజూరు ఉత్తర్వులు, చెల్లింపుల వివరాలను సమగ్రంగా పరిశీలిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.
సెలవు రోజున బీరువా లాకర్ తెరిచారనే ఆరోపణ
ఈ వ్యవహారంలో మరో అంశం కూడా చర్చకు వస్తోంది. మండల పరిషత్ సూపరింటెండెంట్ సెలవు రోజున సంబంధిత ఇన్చార్జ్ అధికారి బీరువా లాకర్‌ను పగలగొట్టి చెక్కులు తీసుకుని డబ్బులు డ్రా చేసినట్టుగా సమాచారం ప్రచారంలో ఉంది. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు అధికారికంగా ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

ఈ విషయం వాస్తవమా? కాదా? అన్నది అధికారిక విచారణలో తేలాల్సి ఉంది.
ప్రభుత్వ నిధులు ప్రజల అవసరాల కోసం వినియోగించాల్సి ఉండగా, వాటి నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సంబంధిత రికార్డులను అధికారులు పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. అవసరమైతే ప్రత్యేక ఆడిట్ నిర్వహించి, నిధుల మంజూరు నుంచి చెల్లింపుల వరకు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.రూ.8 లక్షల నిధులకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు బహిర్గతం చేయడంతో పాటు, విచారణలో నిధుల వినియోగంలో ఏవైనా అవకతవకలు బయటపడితే బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
అధికారుల వివరణ రావాల్సి ఉంది: ఈ వ్యవహారానికి సంబంధించి సంబంధిత ఇన్చార్జ్ అధికారి, మండల పరిషత్ సూపరింటెండెంట్, పంచాయతీ కార్యదర్శుల అధికారిక వివరణలు వెలువడాల్సి ఉంది. అధికారుల వివరణ అనంతరం ఈ వ్యవహారంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular