📄 ePaper
Saturday, August 29, 2026
Homeఇంటర్నేషనల్టాటా ప్రియులకు శుభవార్త..

టాటా ప్రియులకు శుభవార్త..

📰 Generate e-Paper Clip

– మార్కెట్‌ను కుదిపేస్తున్న కొత్త సియెర్రా కారు

ముంబై, నవంబర్‌ 23, మనప్రజాప్రతినిధి:

టాటా మోటార్స్ అభిమానులకు ఆనందకరమైన సమాచారం వచ్చింది. ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ టాటా సియెర్రా పేరుతో వచ్చిన కొత్త మోడల్ కారు ఈ నెల 25న అధికారికంగా విడుదల కానుంది. ఒకప్పుడు దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న సియెర్రాను ఇప్పుడు పూర్తిగా కొత్త అవతార్‌లో తీసుకొస్తూ, ప్రయాణికుల అవసరాలకు తగ్గ విధంగా ఆధునిక సౌకర్యాలతో సిద్ధం చేశారు. పెట్రోల్‌, డీజిల్‌తో పాటు పూర్తిగా విద్యుత్తుతో నడిచే వేరియంట్‌లలో కూడా ఈ కారు మార్కెట్లోకి వస్తోంది.
ఈ కొత్త సియెర్రా డిజైన్ పాత మోడల్‌కు గుర్తు చేస్తూనే, ఆధునిక ఆకృతితో ఆకట్టుకునేలా తయారు చేశారు. బలమైన ముందు భాగం, వెడల్పైన బాడీ, పెద్ద గాజు పైకప్పు వంటి లక్షణాలు దీని ప్రత్యేకత. లోపల ప్రయాణికుల సౌకర్యం కోసం మూడు డిజిటల్ స్క్రీన్ల అమరికను అందించారు. డ్రైవర్ ముందు డిజిటల్ మీటర్, మధ్య భాగంలో పెద్ద టచ్ స్క్రీన్, ముందు సీట్లో కూర్చునే వారికి ప్రత్యేక స్క్రీన్ ఉండేలా రూపకల్పన చేశారు. ఉత్తమ నాణ్యత గల ధ్వని వ్యవస్థతో సంగీత ప్రియుల్ని కూడా ఆకట్టుకునేలా చేశారు.
భద్రత విషయంలో కూడా టాటా కంపెనీ ఎలాంటి రాజీ పడలేదు. ఆరు గాలిబ్యాగులు, జారిపోకుండా ఉండే బ్రేకింగ్ వ్యవస్థ, ఎక్కై దిగే దారుల్లో కారును నిలబెట్టే సదుపాయం, టైర్లలో గాలి పీడనాన్ని చూపించే వ్యవస్థ, చుట్టూ చూపించే కెమెరా వంటి అనేక భద్రతా ఫీచర్లు అందించారు. అలాగే మార్గంలో లేన్ మార్చేటప్పుడు సహాయపడే, ప్రమాదం జరుగకముందే హెచ్చరించే ఆధునిక భద్రతా సాంకేతికతను కూడా ఇందులో పొందుపరిచారు.
ఇంజిన్ పరంగా పెట్రోల్‌, డీజిల్ మోడళ్లతో పాటు విద్యుత్తుతో నడిచే వేరియంట్ కూడా అందుబాటులోకి రానుంది. విద్యుత్తు మోడల్ ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే ఐదు వందల కిలోమీటర్లకు పైగా ప్రయాణించే సామర్థ్యం ఉంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
మధ్యతరహా కార్ల విభాగంలో ఈ సియెర్రా ఇప్పటికే ఉన్న ప్రముఖ కంపెనీల మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ప్రారంభ ధర సుమారు పదకొండు లక్షల రూపాయల నుంచి ఉండగా, టాప్ మోడళ్ల ధర ఇరవై లక్షల రూపాయల వరకు ఉండే అవకాశం ఉందని అంచనా. విద్యుత్తు వేరియంట్ ధర ఇరవై నుంచి ఇరవై అయిదు లక్షల మధ్య ఉండొచ్చని సమాచారం.
పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ, కొత్త సాంకేతికతతో మార్కెట్లోకి వస్తున్న టాటా సియెర్రా కారు త్వరలోనే రోడ్లపై కనువిందు చేసేందుకు సిద్ధంగా ఉంది. టాటా అభిమానులతో పాటు వాహన ప్రేమికులందరిలోనూ దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.