📄 ePaper
Sunday, August 30, 2026
Homeతెలంగాణఆస్తి కోసం రక్తపాతం

ఆస్తి కోసం రక్తపాతం

📰 Generate e-Paper Clip

– తండ్రి ప్రాణాలపై కన్నేసిన కుమారులు
– సుపారీ హత్య వెనుక కుట్ర
– వెలుగులోకి వచ్చిన పోలీసుల విచారణ
– పరారీలో కీలక నిందితులు

ఘజియాబాద్, జనవరి 2 (మనప్రజాప్రతినిధి):

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న రిటైర్డ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాజీ అధికారి యోగేష్ (58) హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. డిసెంబర్ 26న లోనీ ప్రాంతంలోని అశోక్ విహార్ కాలనీలో ఇంటికి తిరిగి వస్తున్న యోగేష్‌పై బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్పులు జరిపి హత్య చేశారు. మొదట ఇది అన్యుల చేతిలో జరిగిన దాడిగా భావించిన పోలీసులు, దర్యాప్తులో షాకింగ్ నిజాలను వెలికి తీశారు.
పోలీసుల కథనం ప్రకారం… ఈ హత్య వెనుక యోగేష్ సొంత కుమారులే ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. తండ్రి ఆస్తిపై ఆశతో పాటు, తాము నివసిస్తున్న ఇంటిని ఖాళీ చేయాలని యోగేష్ కొంతకాలంగా ఒత్తిడి తెస్తుండటంతో కుమారులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలో తండ్రిని అడ్డుతొలగించుకోవాలనే దురుద్దేశంతో హత్యకు కుట్ర పన్నారు. తమ పక్కింట్లో నివసించే అరవింద్ (32) అనే వ్యక్తికి సుపారీ ఇచ్చి యోగేష్‌ను హతమార్చాలని ఒప్పందం కుదుర్చుకున్నారు.ఆ సుపారీ మేరకు అరవింద్ తన బావమరిది నవీన్‌తో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. నవీన్ కౌశాంబి జిల్లాలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. డిసెంబర్ 26న యోగేష్ ఇంటివద్దకు చేరుకునే సమయంలో బైక్‌పై వచ్చి అతడిపై కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ కాల్పుల్లో యోగేష్ అక్కడికక్కడే మృతిచెందారు.బుధవారం సాయంత్రం ప్రధాన నిందితుడు అరవింద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి పిస్టల్, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో యోగేష్‌పై తానే కాల్పులు జరిపినట్లు అరవింద్ అంగీకరించాడు. ఘజియాబాద్ కోర్టు అతడిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. యోగేష్ ఇద్దరు కుమారులు, కానిస్టేబుల్ నవీన్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.ఆస్తి కోసం తండ్రి ప్రాణాలకే ముప్పుగా మారిన ఈ ఘటన సమాజాన్ని తీవ్రంగా కలచివేస్తోంది. రక్త సంబంధాలనే మరిచిపోయే స్థాయికి మానవ సంబంధాలు దిగజారుతున్నాయా? అన్న ప్రశ్నలను ఈ కేసు మరోసారి ముందుకు తెచ్చింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.