– రైతుల సమస్యలపై చర్చ డిమాండ్
– బీఆర్ఎస్ ప్లకార్డులతో నిరసన
– ప్రభుత్వం–ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం
– స్పీకర్ నిర్ణయంతో గందరగోళం
తెలంగాణ శాసనసభ, హైదరాబాద్, జనవరి 2 (మనప్రజాప్రతినిధి):
తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాల రెండో రోజు తీవ్ర ఉద్రిక్తతల నడుమ కొనసాగుతోంది. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరత అంశంపై వెంటనే చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అసెంబ్లీలో పెద్ద ఎత్తున నిరసనకు దిగింది. ఈ ఉదయం సభ ప్రారంభమైన వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని అసెంబ్లీ హాల్‌లోకి ప్రవేశించారు. “కాంగ్రెస్ వచ్చింది.. రైతులను నిండా ముంచింది” అంటూ నినాదాలు చేస్తూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
వ్యవసాయ సీజన్ కీలక దశలో ఉన్నప్పటికీ రైతులకు సకాలంలో యూరియా అందడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. పొలాల్లో పంటలు కీలక దశలో ఉండగా ఎరువుల కొరత రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందని, ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇందుకు కారణమని వారు మండిపడ్డారు. యూరియా సరఫరాపై తక్షణమే చర్చ చేపట్టాలని కోరుతూ బీఆర్ఎస్ సభ్యులు వాయిదా తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. రైతుల సమస్యలను పక్కనపెట్టి సభను సాధారణ కార్యక్రమాలతో కొనసాగించడం సరికాదని వారు స్పష్టం చేశారు.
అయితే ప్రతిపక్షాల నిరసనపై శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా స్పందించారు. ప్రతిపక్ష సభ్యులకు ప్రశ్నోత్తరాల సమయం జరగడం ఇష్టం లేనట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. సమస్యలుంటే సభలో నిర్దిష్టమైన పద్ధతుల్లో చర్చకు రావాలని, కానీ ఇలా నినాదాలు చేస్తూ సభా సమయాన్ని వృథా చేయడం సరైంది కాదని ఆయన సూచించారు. ప్రభుత్వం రైతుల సమస్యలపై బాధ్యతతోనే వ్యవహరిస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు యూరియా అంశంపై పాయింట్ ఆఫ్ ఆర్డర్ కోరారు. అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దానికి అనుమతి నిరాకరించారు. ప్రశ్నోత్తరాల సమయంలో పాయింట్ ఆఫ్ ఆర్డర్‌కు అవకాశం లేదని బీఆర్ఎస్ నేత హరీశ్ రావుకు స్పీకర్ స్పష్టం చేశారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు వెనక్కి తగ్గకుండా నిరసన కొనసాగించడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. రైతులకు యూరియా సరఫరాపై ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వలేదని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా, ప్రతిపక్షం కావాలనే సభను అడ్డుకుంటోందని ప్రభుత్వం కౌంటర్ ఇస్తోంది. ఈ పరిణామాలతో అసెంబ్లీలో ప్రభుత్వం–ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమైంది.
యూరియా కొరతపై అసెంబ్లీలో రచ్చ
RELATED ARTICLES

