మనప్రజాప్రతినిధి//హుజూర్ నగర్, నవంబర్ 10స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నేడు (మంగళవారం) ఉదయం నిర్వహించ తలపెట్టిన హుజూర్ నగర్ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం వివాదాస్పదంగా మారింది. ప్రజా సమస్యలపై చర్చించి, నిర్ణయాలు తీసుకోవాల్సిన ఈ అత్యున్నత సమావేశానికి మున్సిపల్ మేనేజర్ మీడియాను అనుమతించక పోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.పట్టణాభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలు, ప్రజా సమస్యలు, వార్షిక కేటాయింపులు మరియు మౌలిక వసతుల కల్పనపై చర్చించేందుకు మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే సమావేశాన్ని కవర్ చేయడానికి వచ్చిన స్థానిక మీడియా ప్రతినిధులను కౌన్సిల్ హల్ బయటే నిలిపివేశారు. సమావేశంలోకి మీడియాను అనుమతించేది లేదని మున్సిపల్ మేనేజర్ స్పష్టం చేసినట్లు సిబ్బంది తెలిపారు.
జర్నలిస్టుల ఆగ్రహం
ప్రజాధనంతో నిర్వహించే, ప్రజలకు నేరుగా సంబంధించిన కౌన్సిల్ సమావేశ వివరాలను ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత మీడియాపై ఉంటుందని మేనేజర్ ఏకపక్షంగా మీడియాను అడ్డుకోవడం అప్రజాస్వామికమని జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యంలో పారదర్శకత లోపించడానికి ఇలాంటి నిబంధనలే కారణమని, సమావేశ వివరాలను గోప్యంగా ఉంచడం వెనుక ఆంతర్యమేమిటని పలువురు కౌన్సిలర్లు ప్రశ్నిస్తున్నారు.
హుజూర్ నగర్ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం మీడియాకు అనుమతి నిరాకరణ
RELATED ARTICLES



