“సమ్మె బాటలో బ్యాంకర్లు.. ఐదు రోజుల పనిదినాలే ప్రధాన డిమాండ్
“వారానికి ఐదు రోజుల పనిదినాల విధానాన్ని అమలు చేయాలి: ఐఎన్‌టీయూసీ నేత ముకేష్ గౌడ్
సిద్దిపేటనియోజకవర్గం,సెప్టెంబర్11(మనప్రజాప్రతినిధి): బ్యాంకింగ్ రంగంలో వారానికి ఐదు రోజుల పనిదినాల విధానాన్ని తక్షణమే అమలు చేయాలని ఐఎన్‌టీయూసీ నేత ముకేష్ గౌడ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుని బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
సిద్దిపేటలో శుక్రవారం నిర్వహించిన బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు భారీ స్పందన లభించింది. సుమారు 200 మంది బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొని తమ డిమాండ్లకు మద్దతుగా నినదించారు. యూనియన్ బ్యాంకు నుంచి పాత బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉద్యోగుల హక్కులు, ఉద్యోగ భద్రత, పని పరిస్థితులు తదితర అంశాలపై నాయకులు మాట్లాడారు.
ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలి
ఈ సందర్భంగా ముకేష్ గౌడ్ మాట్లాడుతూ.. బ్యాంకింగ్ ఉద్యోగులు చాలాకాలంగా వారానికి ఐదు రోజుల పనిదినాల కోసం డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం అంగీకరించిన మేరకు ఈ విధానాన్ని ఆలస్యం చేయకుండా అమల్లోకి తీసుకురావాలని కోరారు. ఉద్యోగుల పని ఒత్తిడిని తగ్గించి మెరుగైన పని వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ప్రోత్సాహకాల్లో వివక్ష ఉండకూడదు
బ్యాంకు ఉద్యోగులందరికీ సమానమైన, పారదర్శకమైన పనితీరు ఆధారిత ప్రోత్సాహక విధానాన్ని అమలు చేయాలని ముకేష్ గౌడ్ డిమాండ్ చేశారు. ఉద్యోగుల మధ్య వివక్షకు తావులేకుండా ప్రతి ఒక్కరి కృషికి తగిన గుర్తింపు, ప్రోత్సాహకం అందేలా విధానాలను రూపొందించాలని అన్నారు.
బ్యాంకర్ల హక్కులు,ఉద్యోగ భద్రత, మెరుగైన పని పరిస్థితుల కోసం ఉద్యోగులంతా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం భవిష్యత్‌లో కూడా ఉద్యమాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో యూఎఫ్‌బీయూ నాయకులు రమేష్, మధు, బాలసిద్ధులు, దినేష్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో బ్యాంకు ఉద్యోగులు పాల్గొని సమ్మెను విజయవంతం చేశారు.
బ్యాంకర్ల డిమాండ్లపై కేంద్రం వెంటనే స్పందించాలి!
RELATED ARTICLES



